VTTBOJC Om Tt Sat PTL
Teniyal chindu naa telugu

శతకము (Satakamu) 2

వచన సాహిత్యము    - పీఠికలు    - శతక వాఙ్మయ చరిత్ర


శ్రీ ఆంధ్రశతక వాఙ్మయ పరిణామ చరిత్ర - శ్రీ నిడుదవోలు వెంకటరావు

ఆంధ్రవాఙ్మయమున ప్రత్యేకవిశిష్టత గల శాఖలలో "శతకము" అనుశాఖ గణనీయమైనది. ఇది పండితులను, పామరులను, బాలురను, వృద్ధులను, సామాన్య ప్రజానీకమును సర్వేసర్వత్ర సమానముగా రంజింప జేయగల శక్తిమంత మైనది. భారతీయ దేశభాషలలో సంస్కృతమును సంపూర్ణముగా తనలో నైక్యము చేసికొనినది తెలుగు భాష యొక్కటియే. ఈ కారణము చేతనే, మన సాహిత్య ప్రక్రియల పేళ్లన్నియు సంస్కృత భాషలో నున్నను - వాస్తవముగా నాయా సాహిత్య ప్రక్రియలుగాని, శాఖలుగాని - అందు విశేషముగ గన్పట్టవు. చంపూ, ద్విపద, శతక, ఉదాహరణ, యక్షగాన, గేయ, సంకీర్తన వాఙ్మయ శాఖ లిందుల కుదాహరణములు.

శతకములు పురాణములవలె కథా ప్రధానములు గావు; ప్రబంధములవలె వర్ణనాప్రధానములు గావు; గేయకృతులవలె సంగీత ప్రధానములుగావు. ద్విపదల వలె దీర్ఘపరిమితి గలవి కావు. ఇవి ముక్తకము లయ్యును, నేక సూత్రత గలవి. సుసంస్కృతములైనను సులభగ్రాహ్యములైనవి. శతకములలో కవి యాత్మానుభవము ప్రకటిత మగుచుండును. కాబట్టియే అవి హృదయమున కత్యంత సన్నిహితములై, ఆంతరంగిక స్వానుభూతిని గలిగించును.

శతకములు తెలుగున క్రీ.శ.12వ శతాబ్దినుండి వర్ధిల్లుచున్నవి. నవీన కాలమున నీ రచన యంతగా వ్యాప్తిలో లేకున్నను పూర్తిగా విస్మృతమైనదనుట కెంతమాత్రమును వీలులేదు. అద్యతనులలో పెక్కురు ప్రసిద్ధులైనవా రీశతక రచనకు గడగుటయే దీనికి నిదర్శనము. ఇతర రచయితలు చాలమంది శతకములను రచించుచునే యున్నారు. ఇట్లీ వాఙ్మయశాఖ యవిచ్ఛిన్నముగ కొనసాగు చున్నదనియే చెప్పవచ్చును.

ఉపలబ్ధములైన తెలుగు గ్రంథములలో, కేవలము సంఖ్యయే ప్రధానముగ దీసికొనినచో, తక్కిన ప్రబంధాది శాఖలన్నింటికంటె, శతక వాఙ్మయ శాఖయం దున్న సంఖ్యయే యధికమని ఘంటాపథముగ జెప్పవచ్చును. ఒక్కతెలుగుననే గాక, విశాలమగు సంస్కృత భాషా వాఙ్మయమున నిన్ని శతకములు లేవు. అందలి శతకములు, శతసంఖ్యనుగూడ మించవేమో యనుటలో నతిశయోక్తి లేదు. ఇక సజాతీయము లైన ద్రవిడ, కన్నడ, మళయాళ భాషలలో శతక రచనయే చాల విరళము. కన్నడ భాషలో శతకము మన భాష కంటె ముందుగా నవతరించినను ఆ భాషలో దానికి ప్రాధాన్యమే లేదు. ఇది యొక్కటియే తెలుగులో శతక సాహిత్యముయొక్క ప్రత్యేకతను ప్రదర్శించును.

సంస్కృతానువాదములైన శతకముల సంఖ్య శతమును మించవు. కావున వేలకు మించిన తెలుగు శతకములన్నియు స్వతంత్ర రచనలనియే నిర్ధారణ చేయ వచ్చును. ఇవి యచ్చముగా, తెనుగు ముద్ర గలిగి దేశి సాహిత్యమునకు సంబంధించినవి.

శతక లక్షణములు

సంఖ్యా నియమము
మకుట నియమము
వృత్త నియమము
రస నియమము
భాషా నియమము
1. సంఖ్యా నియమము

సంఖ్యా నియమము సంస్కృతమున గల స్తోత్రములనుండి గ్రహింప బడినది. 1అష్టోత్తర శత (108) నామపారాయణము, పూజ; సహస్రనామ(1000) పారాయణము, పూజ మనకు విధ్యుక్తములైనవి. వ్రత కల్పములయందు నిర్దిష్టములై యున్నవి. ఈ యాచారము ననుసరించి శతకములలో నూఱు పద్యములు గాని, నూటయెనిమిది పద్యములుగాని యుండును. ఈ నియమమున కపవాదములు గలవు. కాని యవి క్వాచిత్కములు. పై సూత్రము ననుసరించి 108 పద్య సంఖ్య సర్వసామాన్యముగా పాటింపబడకున్నను, శతకము అనగా నూరు(100) సంఖ్య యగుటచేత నూటికి తక్కువగ పద్యములున్న రచన శతక మనిపించుకొనదు. నూటికి తక్కువ రచనలకు ప్రత్యేకముగ పేళ్లు గలవు.

ఒక్క పద్యము    - ముక్తకము
రెండు పద్యములు    - కుళకము
మూడు పద్యములు    - త్రికము
అయిదు పద్యములు    - పంచకము, పంచరత్నములు
ఎనిమిది పద్యములు    - వారణమాల, అష్టకము
తొమ్మిది పద్యములు    - నవరత్నములు
పది పద్యములు    - దశకము
పండ్రెండు పద్యములు    - భాస్కరమాలిక
పదునాఱు పద్యములు    - శశికళ
ఇరువది పద్యములు    - వింశతి
ఇరువదియైదు పద్యములు    - పంచవింశతి
ఇరువదేడు పద్యములు    - తారావళి
ముప్పదిరెండు పద్యములు    - రాగసంఖ్య
ఏబది పద్యములు    - పంచాశత్తు
నూఱు పద్యములు - శతకము
నూట ఎనిమిది పద్యములు - అష్టోత్తర శతకము
రెండువందల పద్యములు - ద్విశతి
మూడువందల పద్యములు - త్రిశతి
2ఏడువందల పద్యములు - సప్తశతి
3పదివందల పద్యములు - దశశత లేక సహస్రము
పైరీతిగా నూటికి పై బడిన పద్యములున్నను, వానిని "శతకములు" గానే పరిగణించుట కాధారము - మకుట నియమము.

2. మకుట నియమము

శతకము ప్రతి పద్యమున చివరనుండు నామ సంబోధనకు 'మకుటము' అని పేరు. శతకము లన్నియు విధిగా సంబోధనాంతములుగా నుండవలయును. చంపువులలో లేక ప్రబంధములలో ప్రాయికముగా సంబోధనలే యుండును. క్వాచిత్కముగా విభక్తి ప్రత్యయము లుండును. కాని శతకములలో సంబోధన విభక్తికి తప్ప4తక్కినవానికి చోటు లేదు.

సంబోధనలో నామోచ్చారణ ప్రధానము. శతకములలో ఆ నామ మన్ని పద్యములలో నొకే రీతిగా నుండును. కావున మకుటము నట్లే నొకే రీతిగా నుండును. మకుటమున పర్యాయపదము లుండరాదు. 'సర్వేశ్వరా' అను మకుటమున్న నట్లే యుండవలయుగాని 'విశ్వేశ్వరా' లేక 'లోకేశ్వరా' అను విధమున నుండరాదు.

3. వృత్త నియమము

పై మకుట నియమముబట్టియే, తెలుగు శతకములలో వృత్త నియమ మేర్పడినది. తెలుగున తొలి శతకము మల్లికార్జున పండితారాధ్యుని "శ్రీగిరి మల్లికార్జున శతకము." దీని మకుటము 'శ్రీగిరి మల్లికార్జునా' అని యుండుటచే నిందు చంపకమాలిక, ఉత్పలమాలిక తప్ప తక్కినవి ప్రయుక్తమగుటకు వీలులేదు. వేమన సహస్రముల, 'విశ్వదాభిరామ వినుర వేమ,' అని మకుటము. ఇం దాటవెలది తప్ప వేరొక ఛందస్సు కుదురదు. ఇట్లే సదానందయోగి శతకమున సదానందయోగి అను మకుటమున్నది. ఇది తేటగీతిలో తప్ప నిముడదు, కావున శతకమంతయు తేటగీతి యగును. తెలుగున ప్రత్యేకముగా కాక, ఆటవెలదులు తేటగీతులు సీసపద్యములకు నియతముగా కూర్పబడుట చేత, సీసపద్యములలో రచితములైన శతకములలో గూడ మకుటనియమ మిట్లే యుండునని గ్రహింపనగును.

పై విషయములను బట్టి శతకములన్నియు నొకే వృత్తముతో, ఒకే ఛందస్సులోనే యుండవలయును.

4. రస నియమము

శతకములలో నే రసము ప్రతిపాదిత మగునో అదియే అన్ని పద్యముల యందు ప్రపంచితము కావలెను కాని వేఱొక రసమున కందు ప్రవేశము కలుగ కూడదు. భక్తిరస ప్రధానములగు శతకములలో నితర రసముల ప్రసక్తి యుండరాదు. శృంగారరస ప్రధానములగు శతకములలో వీర హాస్యాది రసములకు చోటీయరాదు. భక్తి శృంగార రసములకు తప్ప తక్కిన రసము లెంతమాత్రమును ప్రపంచితము కావని సారాంశము. ఈ శతకములలో భావము లొకభాగమున నొకరీతిగాను, వేఱొక భాగమున మఱియొక రీతిగాను నుండరాదు.

5. భాషా నియమము

శతకము లన్నియు, సలక్షణమైన కావ్య భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు, శతకములనుండి ప్రయోగములు, ప్రామాణికములుగా గ్రహించిరి. దీని కపవాదము తెలుగున 'చంద్రశేఖర శతకము' అనునది కలదు. ఇది 'చంద్రశేఖరా' అను మకుటముతో, చంపకోత్పల మాలికలతో రచింపబడినది. ఇందలి భాషయంతయు గ్రామ్యమే.

శతక రచన స్వతంత్రమని యీవఱకు దెలిపితిని. దానికి చారిత్రక విస్తరణ యావశ్యకము.

తెలుగు భాషలో కవితారచన ప్రాయికముగా సంస్కృత ప్రాకృత ద్రవిడ కర్ణాట భాషారచనల వెనుక వెలసినది. ఆ యా భాషలలోని గుణవిశేషములను గ్రహించి, స్వతస్సిద్ధమైన లక్షణములతో సమ్మేళనము చేసికొని ప్రతిభాసంపన్నమైన నూతనత్వమున ప్రవర్ధిల్లినది. శతక విషయమున దీనికి సమన్వయము.

తెలుగు శతకమునందలి ముఖ్య లక్షణములలో సంఖ్యామకుట నియమముల రెండింటిలో, సంఖ్యానియమ మొక్కటియే సంస్కృత శతకములనుండి గ్రహించినది. సంస్కృత శతకములలో మకుట నియమము లేనేలేదు. సంఖ్యా నియమము సంస్కృతమున స్తోత్రములలో మాత్రమే కన్పట్టుచున్నది. మకుట నియమము శ్రీ శంకర భగవత్పాదుల స్తోత్రములనుండి గ్రహింపబడినది. అష్టకాది స్తోత్ర రూపము లైన మకుటములలో కొన్నియెడల సంబోధనలుండుట గమనింపదగినది.

5కన్నడ భాషలో క్రీ.శ. 950 ప్రాంతముల, 'త్రైలోక్యచూడామణి' అను మకుటము గల శతకము వెలసినది. అందు సంఖ్యానియమము, మకుట నియమము రెండును గలవు. ఆ కాలమున తెలుగు కన్నడముల పరస్పర సంబంధమును బట్టి కన్నడ శతక రచనము తెలుగు రచనకు మార్గదర్శకము కావచ్చును. ఇది యొక యుప పాదనమే కాని సిద్ధాంతము కాదు. ఇట్లే తక్కిన శాఖలలోను, తెలుగు కన్నడములకు దగ్గఱ చుట్టఱిక మున్నది. కాని కన్నడమున యతి లేదు. ప్రాస మాత్రమే యున్నది. సంస్కృతమున యతిప్రాసలు రెండును నియతిగా లేవు. ఆంధ్రభాషా స్వభావ సిద్ధములగు నీ యతిప్రాస లక్షణములను తెలుగున పాటించి, తెలుగు శతకమున కొక ప్రత్యేక లక్షణత్వము తెలుగు కవు లాపాదించిరి.

తెలుగున శతకములు చంపకోత్పల మాలికా రచనముతో ప్రారంభమైనవని తెలిపితిని. ఇది యెంతయు సమంజసము. పూజా సమయములలో పుష్పములు ప్రధానము కాబట్టి మల్లికార్జున పండితుడు చంపకోత్పలములతో శివుని సంబోధించుచు శతకము రచించెను. పాల్కురికి సోమనాథుఁ డతని ననుసరించి, తన వృషాధిప శతకమున 'బసవా! బసవా! బసవా! వృషాధిపా!' అను మకుటముతో చంపకోత్పలమాలికలు రచించెను. ఇట్లు చంపకోత్పలమాలికలు రెండు నున్నను, శతక ప్రారంభమున శ్రీకారము నియత మగుటచేత నిందు మొదట భగణముతో ప్రారంభమగు ఉత్పలమాలయే యుండవలెను. భగవద్భక్తి పరమగు శతకము భగణముతో ప్రారంభమగుట విశేషము.

తెలుగు వాఙ్మయమున తొలి వెలసిన శతకములన్నియు శైవమత సంప్రదాయికములు. తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివకవులే. ఆ శివ కవులలో తొలి యిరువురు నిట్లు పుష్పములపేరి ఛందస్సులతో పూజింపగా, యథావాక్కుల అన్నమయ్య యను శివకవి, తన సర్వేశ్వర శతకమున మత్తేభ శార్దూల వృత్తములలో శివుని స్తుతించి యున్నాడు. ఇదియు సమంజసమే. సార్థకమే. శివుడు గజాజిన, వ్యాఘ్ర చర్మాంబరధారి. కావున మత్తేభ శార్దూల వృత్తము లన్వర్థములైనవి. తరువాత వచ్చిన శివదేవధీమణి, శరభాంక లింగ, అంబికా శతకములు చంపకోత్పలములతో రచితములైనవి.

శైవము వెనుకవచ్చిన వైష్ణవమున తొలిశతకమగు వేంకటేశ్వర శతకము, చంపకోత్పలములతో రచితమైనది. ఇదియును పూజాసంబంధమైనదే. మనము, అష్టోత్తర శతనామ పూజ చేయునపుడు ఒక్కొక్కనామము చదువుచు ఒక్కొక్క పుష్పమును పూజచేయుదుము. అట్లే శతకమున నొక్కొక్క సంబోధన కొక్కొక్క పద్యము - ఇది యిందలి విశేషము.

వేంకటేశ్వర శతకమువెనుక 'కృష్ణా దేవకీనందనా', 'ఒంటిమిట్ట రఘువీరా!', 'జానకీనాయకా!' అను విష్ణుభక్తి ప్రతిపాదకమైన శతకములలో మత్తేభ శార్దూల వృత్తములు గలవు. వీనిలో మత్తేభమును మన మొకరీతిగా సమర్థింపవచ్చును. శ్రీమహావిష్ణువు గజేంద్రవరదుడు - అందుచే నీ వృత్తము సమంజసమే.

ఈ సందర్భమున చెప్పవలసిన దింకొకటి గలదు. పై వృత్తములలో నొక్క శార్దూలవృత్తము మాత్రమే, సంస్కృత వృత్తము - అనగా సంస్కృతచ్ఛందో గ్రంథములలో చెప్పబడినది, సంస్కృత చ్ఛందస్సు నుండి గ్రహించినది. కాని తక్కిన మత్తేభ, చంపకోత్పలములు కన్నడాంధ్రుల సృష్టి.

శతకములు చాలవఱకు చంపకోత్పల మత్తేభ శార్దూల వృత్తముల తోడనే రచితములైనవి. ఇక వృత్తములేకాక, జాత్యుపజాతులును శతకములలో ప్రయుక్తము లగునవి యీవఱకు తెలిపితిని. వీని సాంకేతికము గూర్చి కొంత చెప్పవలసి యున్నది.

సీసము

సీసపద్యములలో స్తుతిశతకములున్నవి. పాల్కురికి సోమనాథుడు చతుర్వేద సారమును, బసవలింగ శతకమును 400 సీస పద్యములతో రచియించి యున్నాడు. ఇది శైవ సాంప్రదాయికమే. సీసము - శీర్షిక శబ్దభవము - ఎనిమిది పాదములు గల సీసపద్యము, మొదటి నాలుగు పెద్దపాదములు గాను రెండవ నాలుగు చిన్న పాదములు గాను నేడు మనము మనము వ్రాయుచున్నాము. కాని యిది సరికాదు. పూర్వము, దీనిని ఆఱు పాదములుగానే వ్రాసెడివారు. అనగా సీస పాదములు నాలుగు నాలుగుగాను, దానికి చేర్చబడు, నాలుగేసి ఆటవెలది, తేటగీతి పాదములు, రెండుగాను వ్రాసెడి వారు. దీనిబట్టి సీసమున కాఱు పాదములు మాత్రమేయని స్పష్టము. 14వ శతాబ్ది ప్రథమ పాదమున నున్న విన్నకోట పెద్దన - సీస మాఱడుగులు - ఆఱు పాదములు - అని చెప్పి యున్నాడు.

సీసము శీర్షకశబ్ద భవముగదా - ఆఱు శీర్షములు గలవాడు - కుమారస్వామి - కాబట్టి సీసపద్యమునందు గల ఆఱుపాదములును కుమారస్వామిని స్ఫురింపజేయును. ఆఱు ముఖములతో నిష్టదైవమును స్తుతించినట్లగును.

పాల్కురికి సోమనాథుడు - బసవలింగ శతకమునేకాక నింక నొకటి రెండు సీసపద్య శతకములను రచియించి యుండెనేమోనని యనుమానము గలుగుచున్నది. 'చిరశుభాంక సోమశేఖరాంక' అను మకుటముగల సీసపద్య మొకటియు, 'శరభలింగ' అను మకుటము గల సీపద్యముల సీసపద్య మొకటియు, సంకలన గ్రంథముల లభించుచున్నవి. వీనికర్త పాలకురికి సోమనాథుడని యందు గలదు. వీనియన్నింటి యందును, సీసముల కాటవెలదులే యుండుట గమనింపదగినది. 'అన్యవాద కోలాహలము' అను నామాంతరముగల సోమనాథలింగ శతకము రచించిన ఏకామ్రనాథుడు (ఏకోరామనాథుడు) తన శతకమున - సీసముల కాటవెలదులే వ్రాసి యున్నాడు.
"ఏ నుపన్యసింతు నేకామ్ర గురుచిత్త
నలినభృంగ సోమనాథలింగ"
అని దాని మకుటము. ప్రాచీన శాసనములలోను, నన్నయ రచిత భారత భాగమున, సీసములకు ఆటవెలదులే ప్రాయికముగా గలవు. దీనినిబట్టి తొలుత ఆటవెలదియే సీసములకుండెననియు, దానికి బదులుగా తరువాత, తేటగీతి చేర్చుటచే, అది 'ఎత్తుగీతి' అయ్యెననియు గ్రహింపనగును.

కందము

కందము నీతులను దెలుపుటకు శతకములలో నుపయుక్తమైనను నదియు శివస్తుతిపరముగ మొదట నుపయుక్త మైనది. కందము స్కంద శబ్దభవము. స్కందుడనగా కుమారస్వామి. పూర్వాంధ్ర సాహిత్యమున కందమునకు హెచ్చు ప్రచార ముండెడిది. మల్లికార్జున పండితుడు శివతత్త్వ సారమున వేయి కందములు రచించియున్నాడు. 6నన్నయ, నన్నెచోడు లిరువురు తమ కావ్యములలో కందములనే విశేషముగా వాడియున్నారు. శివకవి చక్రపాణి రంగనాథుడు 'చంద్రాభరణా' అను మకుటము గల కందపద్య శతకము వ్రాసి యున్నాడు. తరువాత కందపద్య శతకముల సంఖ్య గణనీయమైనది.

ఆటవెలఁది

ఆటవెలది ఛందస్సుతో సహస్రాధిక పద్యములు రచించిన మహాకవి వేమన, ఇవి సంఖ్యా నియమము ననుసరించి సహస్రాధికములైనను, ఏకమకుటము గలిగిన కారణమున శతక వాఙ్మయమున విశిష్టములైనవి. ఆటవెలది పేరు సార్థకమగునట్లు రెండు పాదములు గలది. పూర్వమది సీసములో నుండుటచే రెండు పాదములుగానే వ్రాయబడు చుండెడిది. సీసమునుండి వేఱుపఱచినప్పు డది నాలుగు పాదములుగా వ్రాయుట తటస్థించినది. ఈ ఛందస్సు శైవసంప్రదాయిక మైనదే. 'ఆటవెలది' నేడు నిర్బిందుకముగా వ్రాయబడుచున్నను, అది అర్ధానుస్వార ఘటితము - ఆటవెలఁది, అది పూర్ణానుస్వారమైనప్పుడు - ఆటవెలంది. ఇందుండునవి - ఏడు మాత్రలు (ఆ-2,ట-1,వె-1,లం-2,ది-1 : మొత్తము ఏడు.) ఈ మాత్రసంఖ్య సప్తమాతృకా స్వరూపము - కుమారస్వామి సప్తమాతృక లను బాలగ్రహములను గావించియున్నాడు. కావున నిది శక్తి విశిష్టము.

మధ్యాక్కర ఛందస్సుతో నవీన కాలమున శతకములు వెలసినవి. మధ్యాక్కర - ఆటవెలందివలె - సప్తమాతృకా స్వరూపము. (మ-2,ధ్యా-2,క్క-2,ర-1 : మొత్తము ఏడు మాత్రలు)

ఇట్లు శోధించిన మన ఛందస్సులలోని వృత్త జాతుల యంతరార్థమెంతయో యున్నదని గ్రహింపగలము.

మకుటములను బట్టి ఏక యతిప్రాస నియమములు, శతకముల యందు గాననగును -

వృషాధిప శతకమున, చంపకోత్పలమాలికలలో 'బసవా! బసవా! బసవా! వృషాధిపా!' మకుటము - ఇందు సర్వత్ర మొదట 'బసవా' లోని 'వా' అను నక్షరము పై యతి.

శ్రీకాళహస్తీశ్వరశతకము - 'శ్రీకాళహస్తీశ్వరా!' ఇచ్చట 'శ్రీ' యతిస్థానము - ఏక యతి.

ఒంటిమిట్ట రఘువీరశతకము - 'ఒంటిమిట్ట రఘువీరా జానకీనాయకా!' అని మకుటము. ఇచట 'రా' యతిస్థానము.

కొన్ని శతకముల మకుటమంతయును, నొకేపాదముగా నుండును. అప్పుడు ప్రాసయం దేమార్పు లేకయే యుండును.

చిరభవ శతకము - (కూచిమంచి తిమ్మకవి విరచితము) 'చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! యభవా! మహాభవా!' అను మకుటము. ఇచట 'ర' సర్వత్ర ప్రాస.

వరదరాజ శతకము (మంచెళ్ల కృష్ణకవి)
'మం। దరధర కుంద సుందరరదా వరదా మురదానవాంతకా' అను మకుటము. ఇట 'ర' సర్వత్ర ప్రాస.

ఒక్క పాదమే మకుటముగాగాక, మూడవ చరణమున కొంత భాగముతో, నాల్గవ చరణ మంతయు కలిపి మకుటముగా నున్న శతక మొకటి కలదు. దానిపేరు 'ఉద్దండరాయ శతకము'.
'... ... ... ... ... ... ... ... ... ... మద్దాలి యుద్దండరా
య జయ శ్రీ సువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!'.
ఇందు మూడవ పాదమున 'మ' యతి స్థానము. 'మ' ఏకతరయతి, ప్రాస. శతకమంతయు 'జ' కారప్రాస. ఇట్టి నియమములతో శతకమువ్రాసిన కవి దిట్టకవియే! ఆద్యతనులలో కీర్తిశేషులు మండపాక పార్వతీశ్వర శాస్త్రులుగారును, కవిసార్వభౌమ వడ్డాది సీతారామాంజనేయ కవిగారును నిట్టి శతకములు రచించియున్నారు. వీని నేకప్రాస శతకము లనవచ్చును.

మకుట విశేషములు

శతకములు సంబోధనాంతముగా నుండుటయే పరిపాటి. అయినను వీనికి కొన్ని యపవాదములు లేకపోలేదు.

రంగశాయి శతకము - 'గోపాలుఁడు రంగశాయి మనపాల గలండు విచార మేఁటికిన్‌' పూరుషముఖ్యు శతకము - 'పూరుషముఖ్యుఁడా భువనపూజ్యుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్‌' ఈరెండును మంచెళ్ల కృష్ణకవి రచితములు. ఇందు దూత పుసులూరి సోమరాజామాత్యకవి.

జానకీజాని శతకము - 'జానకీ! జానికి, రామచంద్రమహిజానికి సాటి విభుండు లేఁడిలన్‌' మైలవరపు సూర్యనారాయణమూర్తి రచన.

వీనినిగూడ ఏకప్రాస శతకము లనవచ్చును.

కేవల సంబోధనయేగాక, సంబోధనతో కొన్నిపదము లనుప్రయుక్తములైన శతకములు గలవు.

'ఇందూ! నందుని మందనుండికద నీ వేతెంచుటల్‌ రాకలన్‌' ఇదియు నేక ప్రాస శతకమే. 'ఇందూ!' సంబోధన.

మానసబోధ శతకము - తాడేపల్లి పానకాలరాయ ప్రణీతము. ఇందు - 'మనసా! హరిపదము లాశ్రయింపుమా' అను మకుటము. ఇందు 'మనసా!' అనునది సంబోధన. 'సా' పైని యతి - ఏకయతి.

మానసబోధ శతకము - కాసుల పురుషోత్తమకవి. ఇందు 'మనసా! హరి పదము లాశ్రయింపవే' అను మకుటము యతి పై రీతినే యుండును.

ఇట్టిదే 'మానసమా! నిరంతరము మంగళ దేవత నాశ్రయింపుమా' అను మానస శతకము మండపాకవారిది గలదు.

కొన్ని శతకములు సంస్కృతభాషా మిశ్రితములయ్యు మకుటము లచ్చ తెలుగున నున్నవి.

బళిరకఱివేల్పు శతకము - 'బళిర కరివేల్ప పసిఁడి దువ్వలువ దాల్ప' ఇది సీసపద్య శతకము. వైజర్సు అప్పయకవి రచితము.

రాచబిడ్డ శతకము - 'రాచబిడ్డ డింక బ్రోచు మమ్ము' అని మకుటము. ఇది శంకర శంకరకవి రచితము. ఇది గీతపద్య శతకము. మకుటమున ప్రాస యతి.

చిఱుతవజీరు శతకము - 'చిఱుతవజీరా' అను మకుటము. పూసపాటి వీరపరాజకృతి - కందపద్య శతకము. 'చి' పైని యతి.

గునుగు సీస శతకములు

సీసపద్యమున నే పాదమున కాపాదము విడివడక, నాలుగుపాదములను గీతపద్యమున కొంతవఱకు నర్థముతోగూడ నుండునట్టి సీసములకు గునుగు సీసము లని యందురు. పైని చెప్పిన బళిర కఱివేల్పు శతకమేగాక, రావూరి సంజీవకవి రచించిన 'కొలనుపాక వీరనారాయణ' శతకముగూడ నిట్టి గునుగు సీసములు గలది.

సీసపద్య శతకములలో సాధారణముగ గీతపద్య నాల్గవ పాదము మకుటముగ నుండును. కొన్ని యెడల, రెండు పాదములు మకుటముగ నుండును.

'చెన్నమల్లేశ' శతకము. 7'చెన్నమల్లేశ శివలింగ శరణు శరణు' అను మకుటముగలది. గంగాధరకవి రచన.

'కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటి సంకాశ, వెంకటేశ'
వెంకటేశ శతకము - తాళ్ళపాక పెద తిరుమలాచార్యులవారి రచన.

మిశ్రభాషలో వ్రాసినపుడు. అచ్చ తెలుగున మకుటము లుండవచ్చునుగాని, అచ్చతెనుగు భాషలో శతకములు వ్రాసినపుడు మాత్రము, మకుటము లచ్చతెనుగుననే యుండవలెను. అచ్చతెనుగు కవితాపితామహుడు, అజ్జాడాదిభట్ల నారాయణదాసు, రచించిన సింహాచల నారసింహ శతకము, దీనికి 'వేల్పువంద' యని పేరు, దీని మకుటము - 'రెంటత్రాగుడు గొంగపుట్టింటివేల్ప'.

రెంటత్రాగుడు - అనగా ఏనుగు (ఇది తొండముతో నోటితో పీల్చును) గొంగ - అనగా, ఆ యేనుగునకు శత్రువైన సింహము. దాని పుట్టిల్లు - సింహాచలము అచ్చటి వేల్పు - నరసింహస్వామి.

దశక విభాగము

నాటకములయం దంకములవలెను, కావ్యములయం దాశ్వాసముల వలెను, కొన్ని శతకములయందు విభాగములు కాన్పించుచున్నవి.

పోతన నారాయణ శతకమున
1) ఆది, 2) అవతార, 3) దివ్యరూప, 4) నామ, 5) కృష్ణావతార వింశతి, 6) జ్ఞాన వింశతి, 7)మోక్ష వింశతి, అను పదివిభాగములు గావించెను.

పైడిపాటి నృసింహకవి రామచంద్ర శతకమున
1)స్తుతి, 2) కావ్యోన్నతి, 3) దాసవృత్తి, 4) మనోవృత్తి, 5) సంసారము, 6) మాయ, 7) తత్త్వము, 8) అభేదము, 9)దీనత్రాణము, 10)అవతారము, 11) నీతి అను విభాగములు గలవు.

ఇంకను కొన్ని శతకముల నీ విభాగము కలదు.

కొటికలపూడి కోదండరామకవి రచించిన 'జానకీరామ' శతకమున 308 పద్యములున్నవి. ఇందలి విశేష మేమనగా, మూడు శతకములు 'మూడు అంకములు'గా విభాగింపబడినవి.

విషయభాగము

శతకములలో ప్రతిపాద్యమైన విషయము ననుసరించి వాని నీక్రింది రీతిగా విభాగింపవచ్చును.

భక్తి లేక స్తుతి శతకములు
శృంగార శతకములు
నీతి శతకములు
వేదాంత శతకములు
హాస్య శతకములు
చారిత్రక శతకములు
జీవిత చారిత్రక శతకములు
స్వీయచరిత శతకములు
వ్యాజ నిందాస్తుతి శతకములు
కథా శతకములు
సమస్యా శతకములు
నిఘంటు శతకములు
మానవస్తుతి శతకములు
అనువాద శతకములు
అచ్చతెనుగు శతకములు
చాటు శతకములు
జంతుసంబోధ శతకములు
సామాన్య విషయక శతకములు


పై విభాగమును బట్టి - అణువు మొదలు బ్రహ్మాండము వఱకు, తృణము మొదలు మేరువు వరకును గల సమస్త విషయములనుగూర్చి, శతకములయందు ప్రపంచితమైనవని తెలియనగును. వీనివలన దేశ, కాల పాత్రల మూలమున వ్యక్తమగు, రాజకీయ, సాంఘిక, సారస్వత, జాతీయ సంస్కృతి విశేషము లెన్నింటినో మనము గ్రహింప గలము. వీని వివరణ.

భక్తి శతకములు

భక్తిరస ప్రధానములైన శతకములన్నియు దేవతా స్తుత్యాత్మకములు. వీనిలో శివభక్తి, విష్ణుభక్తిని ప్రతిపాదించునవి హెచ్చుగా నున్నవి. శివస్తుతి శతకములలో శివలీలలు, శివభక్తుల మహిమలు విరివిగా గన్పట్టును. కాని విష్ణుభక్తి పరములగు శతకములందట్లుగాదు. విష్ణువుని దశావతారములలో పూర్ణావతారములగు రామకృష్ణావతారములకే ప్రాధాన్యము హెచ్చు. వానిలో రాముని గూర్చిన శతకములు నధిక సంఖ్య గలవి. ఈ సందర్భమున నింకొక విషయ మిట చెప్పవలసి యున్నది. విష్ణుని శ్రీరామకృష్ణాద్యవతారము లన్నంత మాత్రమున కాశతకములలో శ్రీరామానుజ ప్రతిపాదితమైన విశిష్టాద్వైత మతసిద్ధాంతము లున్నవని భావింపరాదు. వీనియందు ప్రతిపాదితమైనది త్రిమూర్త్యాత్మకమైన పౌరాణిక విష్ణుభక్తియే. దశావతారములలో కూర్మావతార, నరసింహావతారములను గూర్చి శతకములున్నవి. నరసింహ శతకములు ప్రచురములు.

శ్రీరాముని భక్తితోగూడ రామదాసాగ్రేసరుడగు నాంజనేయస్తుతి శతకములు ప్రచారములోనికి వచ్చినవి.

త్రిమూర్తులలో బ్రహ్మనుగూర్చిన శతకములు లేవు. వారి భార్యలగు సరస్వతీ, లక్ష్మీ, గౌరీదేవులను గూర్చిన శతకములునవి. పరాశక్తి స్వరూపలగు కాళి, మహిషాసురమర్దనిని గూర్చి శతకములున్నవి.

నవగ్రహములలో సూర్యుని గూర్చి శతకములున్నవి. శనిని గూర్చి యొక శతకమున్నది.

ఆయా క్షేత్రములలో వెలసిన దేవుళ్ళపైని శతకములున్నవి గాని, సకల కార్యములకు ముందు విఘ్నములు కలుగకుండ పూజించు విఘ్నేశ్వరుని గూర్చి మూడు నాలుగు శతకములకంటె హెచ్చు లేవు.

పుత్రజ్యేష్ఠుడగు గణపతిని గూర్చిన శతకములు విశేషముగ లేకపోయినను, కుమారస్వామిని గూర్చి రచనలు గలవు. వీరభద్రస్తుతి శతకములు గలవు.

భక్తి శతకములలో నధునాతనకాలమున కవిశేఖరులు వడ్డాది సుబ్బారాయుడు గారి 'భక్తచింతామణి' శతకమునకు మించినది లేదు. ఇది 1931 నాటికి 32 ముద్రణము లందినది.

శృంగార శతకములు

8తెలుగున శృంగార శతకములు తొలుత భక్తి శృంగార పరములు. రావిపాటి త్రిపురాంతకుని అంబికాశతకము - శివభక్తి శృంగారమును, తాళ్ళపాక అన్నమాచార్యులవారి వేంకటేశ్వర శతకము - వైష్ణవభక్తి శృంగారమును ప్రపంచించినవి. కాలక్రమమున నివిరెండును ప్రాథమికములు. ఆవెనుక కేవలము శృంగార రసైకములగు శతకములు వెలువడినవి. వీనిలో సంభోగ శృంగారము వర్ణించు శతకములకన్న విప్రలంభ శృంగారము వర్ణించు శతకములే హెచ్చు. ఈ విప్రలంభ శృంగారమునకు సంబంధించినవే విరహిణీజాతి శతకములు. విరహిణియగు నాయిక నాయకుని తోడ్తెమ్మని దూతిచే సందేశమునంపుట వీనియందలి యితివృత్తము. ఇందు స్త్రీ విరహమునకు సంబంధించిన శతకములేకాక, పురుష విరహమును వ్యక్తీకరించు శతకములును గలవు. నాయికా విరహము గూర్చిన శతకము సాధారణముగ, నాయా ప్రదేశములనున్న దైవస్వరూపుడగు నాయకుని (శ్రీకృష్ణుని) తోడ్తెమ్మని పంపునవి.

"చెలియ నీవేగి కలువాయి చిన్నికృష్ణు
తోడికొని వేగ రాగదే తోయజాక్షి"
"తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ
రాజగోపాలు దేగదే రాజవదన"
ఈ శతకములకు శైవమునగల శతకములే మాతృక
"వనిత నీవేగి శ్రీశైలవాసుఁ డయిన
మల్లికార్జును దేగదే మధురవాణి"
పురుష విరహ శతకములలో 'వశమె శ్రీరామరామ లావణ్యసీమ' అను 'లావణ్య శతకము'ను, 'సురత మేధారసశ్రేణి సుబ్బసాని' అను 'భోగినీ శతకము'ను ప్రసిద్ధికెక్కినవి.

సంభోగ శృంగార శతకములలో గోపీనాథము వేంకటకవి 'బ్రహ్మానంద శతకము' ముఖ్యమైనది.

ఈ శతకములన్నియు సీసపద్య శతకములు. వీని యందలి సరసత., జాణతనము గలుగు పలుకుబడి చేత శృంగార రస భావము లుద్దీప్తము లగుచుండును. అలంకార శాస్త్రముతో నీ శతకములు సమన్వయించిన, కావ్యములలో కన్న విశేషములు బహిర్గతము లగుచుండును.

నీతి శతకములు

తెలుగు శతకములలో నీతిశతకములు నిరవద్యమైన స్థానమును గడించినవి. ఇవి యన్నియు బహుసులభశైలితో, చక్కనియుపమలతో, జాతీయములతో, బాలబాలికల మనస్సులను హత్తుకొనునట్లు చేయును. పదుమూడవ శతాబ్దినాటి బద్దెన సుమతి శతకము మొదలుకొని, పందొమ్మిదవ శతాబ్దినాటి పక్కి వెంకట నరసయ్య కుమారీ శతకము వఱకు భాస్కరాది నీతిశతకము లాంధ్ర వాఙ్మయము నలంకరించి వ్యాప్తములైనవి. అవి నేటికిని పఠనీయములై యలరారుచున్నవి. సూత్రప్రాయముగా నీతులను దెల్పునవి కందములు గావున వీనిలో కందపద్య శతకములు మెండు. భాస్కరాది శతకములు వృత్తములలో నున్నవి. ప్రసిద్ధమగు భర్తృహరి నీతిశతకమున కనువాదము వృత్తములలోనేకాక కందపద్యములలో నుండుట విశేషము.

వేదాంత శతకములు

ఈ శాఖ తొలుత శివయోగముతో ప్రారంభమై ఆ వెనుక కేవల యోగ మార్గము ననుసరించి, అద్వైతవేదాంత విద్యను నాంధ్ర వాఙ్మయమున ప్రచారము చేసినది. ఇది యథావాక్కుల అన్నమయ వ్రాసిన 'లీలానంద సర్వేశ్వర శతకము' తో మొదలిడినది. శివదేవయ్య, వటమూలుడు దీని పెంపొందించిరి. ఈ శాఖలో ప్రధానుడు విశ్వదాభిరాముడైన వేమన. వేమనలో యోగతాత్విక, వేదాంత విషయములే కాక నీతులు గూడ కలవు. అందులకే వేదాంతకవి యైననూ వేమన కావ్యకవి స్తుతుల కెక్కియున్నాడు. ఆ వేదాంత శతకములలో నతిగంభీరమగు నద్వైత తత్త్వము అరటిపం డొలిచి చేతికిచ్చినరీతి నుండును. దత్తాత్రేయ సంప్రదాయాను సారులైన కవులందఱును నీ వేదాంత శతకములను రచించి, వేదాంత విద్యను తెలుగు వాఙ్మయమున చిరస్థాయి గావించిరి. పందొమ్మిదవ శతాబ్దిలో పరశురామ పంతులువా రీశాఖలో కనిష్ఠికాధిష్ఠితులు. వేదాంత తత్వజ్ఞురాలు తరిగొండ వెంగమాంబ తరిగొండ నృసింహ శతకమంతయు వేదాంతమే!

హాస్య శతకములు

భక్తి, శృంగార, నీతి, వేదాంతములతోపాటు హాస్యరస ప్రధానములగు శతకములు గలవు. కాని ఇవి పదునేడవ శతాబ్ది తర్వాతివి. రాయభట్టు వీరరాఘవకవి వేణుగోపాల శతకాదులిట్టివి. కవిచౌడప్ప శతకమునందును హాస్యమున్నది. కాని యీనాటి యభిరుచులకు సరిపోదు. వీనిలో కవి సాంఘిక విషయములేగాక సారస్వత విషయములు స్పృశించును. అంతమాత్రమున వానిని ప్రామాణికముగ గ్రహింపరాదు. "ద్విపద కావ్యంబు - ముది లంజ - దిడ్డిగంత" అని వేణుగోపాల శతక కర్త రచనపై దాని కొక యుదాహరణ.

చారిత్రకములు

తెలుగు దేశమున ప్రసిద్ధక్షేత్రములపై తురకలు దండెత్తివచ్చిన విషయములను 'కుంపిణీవారు' అనగా ఆంగ్లేయులు ఈస్టిండియా కంపెనీవారు రాజ్యాధికారు లైన తొలిదినములలోను జరిగిన చారిత్రక సంఘట్టనలను దెలుపు శతకములు క్రీ.శ. 16వ శతాబ్ది ద్వితీయపాదమునుండి వెలువడినవి. భల్లా పేరయకవి భద్రగిరి శతకము - క్రీ.శ. 1769-70 ప్రాంతములో తురకలు భద్రాచలముపై దండెత్తినపుడు చెప్పినది.

విశ్వేశ్వర శతకము - ఔరంగజేబు చక్రవర్తి కాశీపట్టణమున మసీదు గట్టించిన సందర్భమున వేల్పూరి విస్సన్నకవి చెప్పినది.

శ్యామలాంబ శతకము - కుంపిణీ పరిపాలనలో రాజమహేంద్రవరములోని రాజకీయ పరిస్థితులను తెలుపునది. రాచూరి లక్ష్మణదాస కృతము.

జీవిత చరిత్రలు

ఒక ప్రసిద్ధ వ్యక్తి జీవితము చిత్రించునవి. గోపాలకృష్ణమూర్తి శతకమిట్టిది. ఇందు సమకాలిక చరిత్ర వ్యక్తమగుచుండును.

స్వీయ చరిత్రలు

కవి తన యాత్మకథను వ్రాసికొనినవి. మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారి హరిహరేశ్వర శతకము (ఆత్మసపర్యాచర్య), కొక్కొండ వెంకటరత్నము పంతులు గారి బిల్వేశ్వరశతకము నిట్టివి.

నిందాగర్భిత శతకములు

వీని నొక విధముగా ఎగతాళితోకూడిన దూషణ శతకములని చెప్పనొప్పును. ఇవి చరిత్రకు సంబంధించినవే. పదునేడు, పదునెనిమిదవ శతాబ్దులలో స్వదేశ సంస్థానాధీశులు పై యధికారులైన నవాబులను లక్ష్యపెట్టక, తమ యిచ్చవచ్చి నట్లు వ్యవహరించుచు ప్రజలను పీడింపదొడగిరి. అట్టి రాజుల దుర్నయత్వమునకు నిరసించుచు వెలువడిన శతకము లివి. వీనిలో ప్రసిద్ధమైనది అడిదము సూరకవి - రామలింగేశ శతకము, కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకము. ఇందు రాజులేకాక సామంతులు, రాజోద్యోగులు, వీరి దుష్టవర్తనలు వర్ణితములై, ఆ కాలపు ప్రజాజీవితమును కన్నులకు గట్టినట్లును ఇవి యొక విధముగా పరిపాలనా విధానము నేర్పు పాఠ్యగ్రంథముల వంటివి. విషయబాహుళ్యము గలవగుటచే నివి సీసపద్యములతో నుండును. ఈరీతి శతకము రాజులకు సంబంధించి మకుటము మాత్రము భగవంతుని పరముగానే యుండును.

వ్యాజనిందాస్తుతి శతకము

ఇవి ఈ శాఖలో లోకోత్తరములు. ప్రాచీనములు గాక పోయినను, పదునెనిమిదవ శతాబ్దినాటివేయైనను కవిత్వ మాహాత్మ్యమును ప్రత్యక్షముగ నిరూపించినవి. ఆ శతాబ్దిలో పిండారి దండు, సుప్రసిద్ధమైన సింహాచల క్షేత్రముపై కొల్లగొనుటకు దండెత్తినది. ఆ దండు మొదట కొండక్రింద విడిసి, ఆపై క్రమక్రమముగా కొండమెట్ల నెక్కి దేవాలయ ప్రాంగణమున ప్రవేశించినది. అప్పుడాక్షేత్రమున సంకీర్తనాచార్యుడు, గోగులపాటి కూర్మనాథకవి, అతడు సంకీర్తనలు చేయుచున్న సమయములో నీ దండు ఆలయమున ప్రవేశించినది. మహాభక్తుడైన కూర్మనాథకవి వెంటనే భగవంతునితో పరాకుచెప్పి, దండును తరిమి, ఆలయమును, ఆంధ్ర ప్రజలను రక్షింపుమని పద్యములతో వేడుకొన్నాడు. కాని కదలిక లేదు. వెంటనే వ్యాజనింద ప్రారంభించినాడు. నీవు చిన్నప్పుడు చేసిన దుండగము లివియని యేకరువు పెట్టినాడు. తుదకు, తురకలను నీవు మరిగినావా! వారు నీకు శఠగోపము పెట్టుదురని మొగమాటమి లేకుండ 68 పద్యములు చెప్పినాడు. 'వైరిహరరంహ సింహాద్రి నారసింహ' అను మకుటముతో. ఇక ఆ దండు గర్భగుడిలో ప్రవేశించడము తడవు వారట్లు చేయటానికి మొదలు పెట్టిన తోడనే, ఏ మూలనుండి వచ్చినవో తెలియదుగాని, వేలకొలది తుమ్మెదలు తండోపతండాలుగా వచ్చి, వారి ముఖాలమీద కుట్టడము ప్రారంభించినవి. కళ్ళు కనబడకుండా ఉన్నవి. దండు తిరుగు మొగము పట్టినది. ఆ తుమ్మెదలు వెంటాడినవి. కొండ దిగగానే అవి పోవునని దండు తలంచినది. కాని యట్లు కాలేదు. ఒకటి కాదు రెండు కాదు, ఎనిమిదిమైళ్ళ దూరము వఱకు తరిమి అచ్చటగల ఒక కొండ బిలములో దాగినవి. 9 దాని కిప్పటికి "తుమ్మెదల మెట్ట" అని పేరు.

కూర్మనాథకవి సంతోషము పట్టజాలక మిగిలిన ముప్పదిరెండు పద్యాలతో సింహాచలనాథుని నుతించి శతకము సాంతము గావించి, కవిత్వము వలన మహత్తును చూపినాడు. ఇట్టివే వేంకటాచల విహార, పశ్చిమరంగ శతకములు.

పై వారు దండెత్తి రాకపోయినను, దేవునకు, రాగభోగములు జరుగక, జీర్ణ స్థితిలో నున్నను, కవులు దేవుని వ్యాజనిందాస్తుతులు చేసి, పూర్వవైభవమును కవితవలన పునరుద్ధరింప జేసినవారు గలరు. వారిలో గణనీయుడు కాసుల పురుషోత్తమ కవి. ఆత డాంధ్రనాయకుడను శ్రీకాకుళాంధ్ర విష్ణువు దేవాలయస్థితిని ఆంధ్రనాయక శతకమను పేర వర్ణించి, దేవాలయమును ప్రాచీన వైభవముతో ప్రకాశింపజేసిన మహాకవి.

కథా శతకము:

శతకముందు నొకానొక కథ క్రమముగా చెప్పుట. వంగూరు నరసకవి ప్రసన్నరాఘవ శతకమున రామాయణ కథ యున్నది.

సమస్యా శతకములు:

ఒక సమస్యనిచ్చి, దాని కొక పద్యము చెప్పుమనుట సంప్రదాయము అయినను, పందొమ్మిదవ శతాబ్దిని సమస్యల నిచ్చి, శతకముగా వానిని పూరింపుమనుట, యొక పద్ధతిగా పరిణమించినది. ఆనంద గజపతీంద్రుని కాలమున నిది ప్రభవించినది.

'సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌' - ఈ సమస్యను అయిదార్గురు కవులు పూరించిరి. ఆపూరణకు 'సత్యవ్రతి శతకము' 10 అనియే పేరు.

ఇట్లే అనుభవరసిక శతకము. ఇది అనుభవ రసికుండెఱుంగు ననుటొప్పుగదా అను సమస్యా పూరణము.

నిఘంటు శతకములు:

ఇవి పద్య నిఘంటువులు - సీసపద్యములతో, ఆయా దేవతల కంకితముగా రచితములగును. ఇవి యన్నియు నచ్చ తెలుగు నిఘంటువులు.

వేంకటేశాంధ్రము - గణపవరపు వెంకటకవి రచన, 'పంకజాతాప్త నీకాశ వెంకటేశ!' అని మకుటము. సాంబ నిఘంటువు - కస్తూరిరంగకవి ప్రణీతము - 'సకలసుర చక్రవర్తి శ్రీ సాంబమూర్తి' అని మకుటము. ఆంధ్రభాషార్ణవము - నుదురుమాటి వెంకనార్యకవి రచించినది. 'మాతృభూత జగత్త్రయీ మాతృభూత' అని మకుటము. ఆంధ్రామరమని దీనికి పేరు. అమరమువలె మూడుకాండలు గలవు. మూడు వందల పద్యము లున్నవి.

మానవస్తుతి శతకములు:

కేవలము ప్రభువులు, సామంతులను, పెద్ద యుద్యోగులను గూర్చి చెప్పినవి. కృష్ణభూపతిలలామ - పాపయమంత్రి శతకములిట్టివి.

అనువాద శతకములు:

సంస్కృతములోనున్న శతకముల కనువాదములు. వీనిలో మయూర సూర్య శతకమునకు, అమరుకవి అమరు శతకమునకు చాల యనువాదములు వెలసినవి. భర్తృహరి సుభాషిత త్రిశతికి యనువాదములు పెక్కులు. ప్రాచీన కవు లీ శతకములను సంస్కృతమున జదివి, వాని భావములను, కావ్యములలో ప్రపంచించిరే గాని, మూలమును సరిగా ననువదింపలేదు. పదునాఱవ శతాబ్దినుండియు నిట్టి రచనలు వెడలినవి.

అచ్చ తెనుఁగు శతకములు:

శతకములలోని భాషయంతయు నచ్చతెలుఁగే. ఆదిభట్లవారి యచ్చ తెనుగు శతకమును గూర్చి యీవఱకు తెలుపబడినది.

చాటు శతకములు:

కళింగదేశమున నీ శతకములు వ్యాప్తములు. ప్రత్యేక చాటువులవలె - శతకమంతయు చెప్పబడును. కన్నెమొయిలి చంద్రరాజు, విరిపాటి రామచంద్రరాజు అను భట్రాజకవు లీ శతకములు రచించిరి.

రెందు పద్యము లుదాహరించుచున్నాను:

రఘుపురీశ శతకము -
కీరము లేని తోట, మది కింపుగఁ బాడనిపాట, చేనికిన్‌
నీరములేని బాట, సభ నీతులు పల్కనిమాట, రస్తువి
స్తారములేని పేట, నిను చాల దలంచనిపూట యేలయా
శ్రీ రమణీయ మా రఘుపురీనిలయేశ! రమేశ! కేశవా!

జామిజనార్దన శతకము -
హీనములేకనే, జగడ మిద్దఱకున్‌ సరిపోకనే సమా
ధానమురూకనే, దొరకు డౌలతు ఎన్నఁగరాని మూకనే
మానము కోకనే, యొకరి మర్మములెంచుట యోర్వలేకనే
మానవలోక మందగుణమర్దన జామిపురీ జనార్దనా!

జంతు సంబోధనలు:

విక్రాల రంగాచార్య విద్వన్మణి శార్దూల శతకము, భమిడిపాటి రామసోమయాజులుగారి కుక్కశతకము, బోయి భీమన కవీంద్రుని పిల్లి శతకము లిట్టివి.

సామాన్య విషయకములు:

పన్నాల సీతారామబ్రహ్మశాస్త్రిగారి 'పూచిపుడక శతకము', త్రిపురాన తిమ్మయరాట్కవీంద్రుని 'నిద్రాశతకము' నిట్టివి.

అద్యతన కాలమున, విద్వన్మహాకవులు నవ్యసాహితీవేత్తలు శతకములను వ్రాసియున్నారు. కవిసామ్రాట్‌, కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణగారు 5 మధ్యాక్కర శతకములను రచించియున్నారు. శతక రచన యింకనూ సాగుచునే యున్నది.

శతకకవులను గూర్చి తొలుత పరిశోధనచేసిన వాఙ్మయ వేత్తలు కీర్తి శేషులు వంగూరి సుబ్బారావుగారు. వారి శతక కవుల చరిత్ర కైలాసవాసి కాశీనాథుని నాగేశ్వరరావుగారి పీఠికతో క్రీ.శ. 1923 లో ప్రకటితమైనది. ఆ వెనుక మరి ముప్పదేండ్లకు నది నూతన పీఠికతో ననుబంధముతో ప్రకటితమైనది. 11సుబ్బారావుగారు తమ ప్రథమ ముద్రణమున విలువగల పీఠిక వ్రాసిరి. అదియే శతకవాఙ్మ పరిశోధనకు తరువాతవారి కాధారమైనది. ద్వితీయ ముద్రణ పీఠికలో నందులో లేని విశేషములు చేర్చబడినవి. విద్వత్కవిభూషణ శ్రీ వేదము వెంకటకృష్ణశర్మగారు శతక వాఙ్మయ సర్వస్వమును రచించిరి. ఇందు నిరువ దైదింటికి విపుల విమర్శన గలదు.

శతక వాఙ్మయ ప్రత్యేక పరిశోధన - ఆంధ్రపత్రిక ప్రథమ సంవత్సరాది సంచిక(1910) లో కేసానపల్లి చెంగయ్యగారి 'ఆంధ్ర శతకములు' అను వ్యాసముతో ప్రారంభమైనది. 1924 లో రచితమైన కళింగదేశ శతకవాఙ్మయము ప్రకటితమైనది. తరువాత 'శతకమంజరి' యనుపేర ఆంధ్రగ్రంథమాలవారు - పెక్కు శతకములను చక్కగ సవిమర్శ పీఠికలతో వెలయించిరి. వావిళ్ళవారు - భక్తి, నీతి, శృంగార శతకములను సంపుటములుగా ప్రకటించిరి. వీని యన్నింటికి తలమానికమైనది డాక్టరు కె. గోపాలకృష్ణరావుగారి శతకవాఙ్మయము. ఇది ఉస్మానియా విశ్వ విద్యాలయాంధ్ర శాఖాధ్యక్షులు - శ్రీ డాక్టరు దివాకర్ల వేంకటావధాని గారి పర్యవేక్షణక్రింద జరిగిన పరిశోధనా ఫలితము. ఇందైదువేల శతకములు పరిశీలింపబడినవి.

ఉపలభ్యములైన శతకములను కాలక్రమమున సంపుటములుగా ప్రకటించిన, నది భాషా సాహిత్యములకు, పరిశోధనకు ప్రధాన సాధనమగును. అపూర్వ విషయము లెన్నియో గ్రహించుటకు నవకాశము గలుగును. అట్టి కృషి జరుగును గాక అని యభ్యర్థన.

1. గృహస్థుల యిండ్లలో అష్టోత్తర శతనామపూజ, దేవాలయములలో సహస్ర నామపూజ నియతములు.

2. సప్తశతి సంప్రదాయము 'భగవద్గీత' (700 శ్లోకములు) నుండి ప్రచారము లోనికి వచ్చినదని చెప్పవచ్చును.

3. తెలుఁగున ప్రాచీనకాలమున శాసనములలోను, శివకవులలోను 'సహస్రము'నకు 'దశశత' సంఖ్య వాడబడినది.

4. దీని కపవాదముగా నొకటి రెండు శతకములు మాత్రము గలవు.

5. తెలుగు కన్నడములకు గల పరస్పర సంబంధ ప్రభావములను సంపూర్ణముగ "తెలుగు కన్నడముల పరస్పర ప్రభావము" అను గ్రంథమున వివరించితిని. అది ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారి బహుమతిని బడసినది.

6. నన్నయ పద్యములు 2487 - వీనిలో కందములు 1219. నన్నెచోడకవి పద్యములు 2005 - వీనిలో కందములు 534.

7. దేశి సంప్రదాయము ననుసరించి యీ యతి సరియైనదియే.

8. త్రిపురాంతకుని అంబికా శతకమున నలభ్యమైన పద్యములను నా "ఉదాహరణ వాఙ్మయ చరిత్ర" లో నిచ్చితిని. అన్నమయ్య వేంకటేశ్వర శతకమును నేనే వ్రాతప్రతిని సంపాదించి వావిళ్ళ వారిచేత ప్రకటింప జేసితిని.

9. ఇది విశాఖపట్టణమున వాల్తేరు స్టేషనుకు ప్రక్కగా నున్నది, ఇది ప్రస్తుతము రుద్రభూమి.

10. దీనిని నా జనకులు నిడుదవోలు సుందరముగారు (ప్రథమాంధ్ర పుస్తక భాండాగార సంస్థాపకులు) పూరించి "సత్యవ్రతి శతకము" అని వ్రాసి క్రీ.శ.1900 లో ప్రకటించిరి. ప్రకటనకర్తలు -నెల్లూరిలో - 'వాగ్వల్లి' పత్రికాధిపతులు.

11. దీని ద్వితీయ ముద్రణ పీఠికానుబంధకర్త - ఈ సంకలన సంపాదకుడు నిడుదవోలు వేంకటరావు.

12. కళింగసంచిక - ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మహామండలి రాజమహేంద్రవరము (1931).

   

శతకాల పట్టిక

. VEMANA PADHYALU.SUMATI SATAKAM
. KUMARA SATAKAM.KUMAREE SATAKAM
. NARAYANA SATAKAM.DASARADHI SATAKALU
. BHASKARA SATAKAM.NARASIMHA SATAKAM
. SRI KAALA HASTI SATAKAM.GUVVALA CHENNA SATAKAM
. SAMPANGIMANNA SATAKAM.SURYA SATAKAM
. VENKATAESA SATAKAM.KUPPUSAAMI SATAKAM
. ALAVELU MANGA VENKATESWARA SATAKAM.ANDHRA NAYAKA SATAKAM
. DHOORTHA MAANAVA SATAKAM.VRUSHADIPA SATAKAM
. CHENNAMALLU SEESAMULU.DEVAKI NANDANA SATAKAM
. MARUTI SATAKAM.MRUTYUNJAYAM
. MANCHI MAATA VINARA MAANAVUDA.SIVA MUKUNDA SATAKAM
. SADAANANDA YOGI SATAKAM.SOORYA SATAKAM - DAASU SREERAMULU
. NEETI SATAKAM.SRUNGAARA SATAKAM
. VAIRAAAGYA SATAKAM.DASARADHI SATAKAM
. NEETI SATAKAM.JAMI JANARDHANA SATAKAM
. HITA SATAKAM.Rama Rama Satakam
SUBSCRIBE TO MUTYALA VARU DEVOTIONAL Mutyala vaari Telugu Library